యూజర్లకు తగినట్టు ఉండే లోకలైజేషన్

Written by: Raghunath J

లోకలైజేషన్ రంగంలో ఉన్నప్పుడు ఎండ్ యూజర్ల ప్రాధాన్యతల గురించి లోతైన అవగాహన ఉండటం తప్పనిసరి. వారికి అర్థమయ్యే భాష, ఇంట్లో, ఇంటి బయట వాడే భాష, అందులోని ప్రత్యేకతలను తెలుసుకుంటేనే వారికి తగినట్టు, వారికి నచ్చేలా లోకలైజేషన్ చేయగలం. అయితే, మనం చేరుకోవాల్సిన ప్రేక్షకులు కోట్లలో ఉంటారు, వారిలో ఎన్నో విభాగాలకు చెందిన వారు ఉంటారు. ఉదాహరణకు – జెండర్, వయస్సు, విద్యార్హత / ఆర్థిక స్థితి, నివాస ప్రాంతం మొదలైన విభాగాలలో విభజించబడి ఉంటారు. వీట్లలో ఒక్కో విభాగం వల్ల వారి భాషా ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. ప్రజలలో వేర్వేరు విభాగాలు ఉన్నట్టే లోకలైజ్ చేయాల్సిన ప్రోడక్టులు కూడా వేర్వేరు విభాగాల వారిని ఉద్దేశించి తయారు చేయబడి ఉంటాయి. 

జెండర్

తెలుగు భాషా వ్యాకరణ సూత్రాలలో పురుష లింగం, స్త్రీ లింగం ఉండి, లింగం ఆధారంగా పదాలకు వేర్వేరు వెర్షన్స్ ఉన్నప్పటికీ, మిగతా భాషలలో లాగానే, శతాబ్దాల కొద్దీ కొనసాగుతోన్న పితృస్వామ్యం వల్ల భాషా వినియోగంలో కూడా పురుష లింగాన్నే ఉదాహరణలలో వాడుతూ ఉంటాం. ఇందు వల్ల, స్త్రీ లింగం వాడటం అనేది రీడబులిటీని దెబ్బతీస్తుంది. ఉదా- నిపుణుడు అనే పదం బాగా వాడుకలో ఉంది, అయితే నిపుణురాలు అనేది చాలా తక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి రీడబులిటీ దెబ్బతినకుండా నిపుణులు అనే బహువచనాన్ని వాడటం గమనించే ఉంటారు. ఇలా బహువచనం వాడటం వల్ల ఆ వ్యక్తికి అదనపు మర్యాదను ఇచ్చినట్టు అవుతుంది కూడా. అయితే, దీని వల్ల ఒక సమస్య ఎదురవుతుంది. ప్రత్యేకంగా ఏక వచనంలో ఎవరైనా మహిళా నిపుణురాలిని పేర్కొనాల్సి వచ్చినప్పుడు నిపుణురాలు అనే వాడాలి, వేరే దారి లేదు. 

ఈ సమస్యను పరిష్కరించడానికి, ట్రాన్స్‌లిటరేషన్ వాడటం మరో పద్ధతి. ఎక్స్‌పర్ట్ అనే ట్రాన్స్‌లిటరేషన్ వాడటం వల్ల లింగానికి సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. ఏక, బహువచనాల సమస్య కూడా లేదు, ఏకవచనం అయితే ఎక్స్‌పర్ట్ అనీ, బహువచనం అయితే ఎక్స్‌పర్ట్‌లు అనీ రాయవచ్చు. అయితే, మునుపటి పోస్ట్‌లలో పేర్కొన్నట్టు ట్రాన్స్‌లిటరేషన్‌ల పట్ల ఉన్న వ్యతిరేకతే ఇక్కడ కూడా ఎదురౌతుంది. ప్రాధాన్యతల వివాదం పక్కన బెడితే, కొన్ని చోట్ల ట్రాన్స్‌లిటరేషన్ చాలా మంది ప్రజలకు అర్థం కాకపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అన్నీ చోట్లా ఉపయోగించలేం. 

ఎండ్ యూజర్లను బట్టి, సందర్భాన్ని బట్టి స్త్రీ లింగాన్ని వాడటం, బహువచనాన్ని వాడటం లేదా ట్రాన్స్‌లిటరేషన్ వాడటం చేయాల్సి ఉంటుంది. 

దాదాపు ప్రపంచంలోని అన్నీ భాషల లాగానే తెలుగులో కూడా మనుషులలో రెండే లింగాలకు గుర్తింపు ఉంది. మూడో లింగం అయిన ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను భారత సుప్రీం కోర్టు గుర్తించి సమాన హక్కులను ఇచ్చింది కాబట్టి, తెలుగు భాషలో కూడా ఆ మార్పులు కనబడాలి. మగ వారిని అతడు అని, ఆడ వారిని ఆమె అన్నట్టు ట్రాన్స్‌జెండర్ వారిని మర్యాద పూర్వకంగా పేర్కొనడానికి మన భాషలో పదాలు లేవు. ఉదాహరణకు ఇంగ్లీష్‌లో ఉత్తమ పురుష ఏక వచనాన్ని (థర్డ్ పర్సన్ సింగులర్) ఆమోదించి అమల్లోకి తీసుకు వచ్చారు. ఇలాంటి మార్పులు తెలుగులో కూడా రావాలి, శతాబ్దాల తరబడి భాషా పరంగా ఈ వర్గ ప్రజలకు జరిగే అన్యాయాన్ని సరిదిద్దేలా మనం ముందుకు సాగాలి.

ఇలా మార్పులు చేసి మెరుగుపరిచిన భాషనే లోకలైజేషన్‌లో వినియోగిస్తే అప్పుడు లింగ వివక్ష అనేది లేకుండా అందరు యూజర్ల మెప్పును ప్రోడక్ట్ పొందుతుంది.  

వయస్సు

ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాప్స్ సంగతి చూద్దాం, వాటి టార్గెట్ యూజర్లు ఎక్కువ శాతం చిన్న పిల్లలు, కొద్దో గొప్పో వారి తల్లిదండ్రులు. ఇలాంటప్పుడు లోకలైజేషన్‌లో వాడాల్సిన భాష, తేలికగా చిన్న పిల్లలకు అర్థమయ్యేలా ఉండాలి.

ఉదా – పునశ్చరణ చేయాల్సిన అంశాలు అని రాస్తే పిల్లలకు అర్థం కాదు, కొన్ని సార్లు వారి తల్లిదండ్రులకు కూడా అర్థం కాకపోవచ్చు. అందుకు బదులు రివైజ్ చేయాల్సిన టాపిక్స్ అని రాస్తే, ఎండ్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని చేసినట్టు ఉంటుంది, అటువంటి లోకలైజేషన్ కలిగిన ప్రోడక్టులకు ఆదరణ లభిస్తుంది.

ఇందులో మరో వైపు ఉదాహరణ – ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు చేసే యాప్స్. వీటి టార్గెట్ యూజర్లు సాధారణంగా 50కి పైగా వయసు కల వారు అయి ఉంటారు. ఇలాంటి చోట్ల కాస్త ఫార్మల్‌గా ఉండే భాషను వాడాల్సి ఉంటుంది.

విద్యార్హత

లోకలైజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఒకవేళ ఏదైనా నిర్దిష్ట రంగంలోని నిపుణులకు ఉద్దేశించినది అయినా, లేదా ఆయా రంగం గురించి కొద్దో గొప్పో పరిచయం ఉన్న వాళ్ళకు ఉద్దేశించినది అయితే, అప్పుడు వాడాల్సిన టర్మినాలజీ అనేది, ఆ రంగంలో ఇదివరకే వాడుకలో ఉన్నది కావడం ఎంతో ముఖ్యం. అలా ఉంటేనే, సదరు యూజర్లు తమ తోటి యూజర్లతో సంప్రదింపులు జరిపేటప్పుడు గందరగోళానికి ఆస్కారం లేకుండా ఉపయోగకరంగా ఉంటుంది. 

ఉదా – ఏదైనా సెర్చ్ ఇంజిన్‌కు చెందిన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను లోకలైజ్ చేస్తున్నాం అనుకుందాం. అలాంటప్పుడు, మీ శోధన పదబంధానికి ఫలితాలేవీ రాలేదు అని రాసే బదులు, మీ సెర్చ్ క్వెరీకి రిజల్ట్స్ ఏవీ రాలేదు అని రాస్తే, అది చదివిన యూజర్‌కు సులువుగా అర్థం కావడమే కాక, లోకలైజ్ చేసిన ప్రోడక్ట్‌ను ఉపయోగించడానికి ప్రత్యేకంగా వేరే టర్మినాలజీని నేర్చుకోవాల్సిన పని తప్పుతుంది. అంతే కాక, ఇతరులతో ఆ విషయాన్ని చర్చించాల్సి వచ్చినప్పుడు, తను పేర్కొనేది అవతలి వాళ్లకు సులువుగా అర్థం అవుతుంది. 

ప్రాంతం

తెలుగు రాష్ట్రాలలో ప్రాంతాన్ని బట్టి వేర్వేరు మాండలికాలు చెలామణిలో ఉన్నాయి. అవి – తెలంగాణ, రాయలసీమ, గోదావరి, ఉత్తరాంధ్ర, నెల్లూరు మొదలైనవి. ఇలాంటి ప్రధానమైన, గుర్తించబడిన మాండలికాలు కాక, వీటిలో కూడా జిల్లా జిల్లాకు కూడా కాస్త మార్పులు ఉంటాయి. ఉదా – అనంతపురం రాయలసీమ యాసకు, చిత్తూరు యాసకు కాస్త తేడా ఉంది. 

సాధారణంగా ఇంతవరకు మాండలికాల గురించిన చర్చ ప్రసార మాధ్యమాల్లో రాలేదు. ఎందుకంటే అధికారికంగా వాడే భాషలో మాండలికాలు ఏవీ తెలియకుండా వార్తా పత్రికలలో ఫార్మల్‌గా రాయడం, ఆ భాషనే న్యూస్ యాంకర్స్ చదవడం జరిగేది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో ఆ మాండలికానికి పెద్ద పీట వేసి పత్రికలలో, టీవీ కార్యక్రమాలలో ప్రాధాన్యతను కల్పించారు.
యూజర్‌ను అమితంగా ఆకర్షించాలి అనుకునే ప్రోడక్ట్ ఏదైనా ఈ మాండలికాల మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచి ఆలోచన. దీని వల్ల, తమ ప్రోడక్ట్ మిగతా వాటిలో వాడే మూస భాషను కాకుండా నేరుగా యూజర్ మాట్లాడే భాషను వాడి, వారికి మరింత దగ్గర అవుతుంది. ఏదైనా కొత్త ఊరికి వెళ్లినప్పుడు అక్కడ మన భాష మాట్లాడే వాళ్లు కనబడితే కలిగే సాంత్వన లాగా యూజర్‌కు సంతృప్తికరంగా ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్‌కు ఇలాంటి భాషను వాడే బదులు, నేరుగా యూజర్‌తో మాట్లాడే వర్చువల్ అసిస్టెంట్ యాప్స్ వంటివి, ఇలా మాండలికాలను ఉపయోగిస్తే, మరింత మెప్పు పొందే అవకాశం ఉంది.

    Leave a Reply

    Your email address will not be published.